అండాండముల యందు అంకురపు రూపమై
బ్రహ్మాండముల లోని ఆ బ్రహ్మతేజమై
వ్యాపించు జగమందు వ్యాపించువాడవై
ముక్కంటి కార్యముల కారణము నీవై
చరియించు చరితలన చాంచల్య యోగమై
అచలముల ఆంతర్య అచలత్వమీవై
రమియించు జగతిలో రమణీయ భావమై
క్రోధించు మనములన క్రోధాంధకారమై
ప్రేమచిందే భావమందెల్ల వెన్నెలై
వేదనల వేసారు వేదనవు నీవై
రక్తానురక్తముల రవళించు నాదమై
భాషలెరుగనిభావ భూమికవు నీవై
మునివరేణ్యుల మధన మాధుర్యమీవు
వెలుగోందు పూర్ణుడవు పూరకమునీవు
నిత్య చైతన్యమౌ నీయందు లీనమై
నీసాటి వాడనని-నిను చిన్నజైలేను
బహుఅల్పమౌనన్ను-నీసరిగ కనలేను
కనులార నినుకనగ నేనెందునెలవొందు?
నీనామ మూనగా ఏసాధకము గొందు?
మధురమౌ నీనాద మేవీనులన్విందు?
దివ్యమౌ నీఉనికినే రీతి అర్చింతు?
అనితరంబౌ చెలిమి నేలాగు నేనొందు?
సరిలేని వేదనల సుడిగుండముల నడచి
మాయ మధుపానమున పడిపడీ లేచి
ఎన్నెన్నొ గండముల గడచి నీగుడి గంటి
సాయిద్యమిచ్చి నను ఇడుములన్బడనీకు
ప్రేమాంతరంగుడవు దాక్షిణ్యరూపుడవు
నాచిన్ని ఊహలన అనుదినము ఉదయించు
అనురాగరూపుడై నా సుతుల మదినిండు.