అలమేలు మంగమ్మ అలసినానమ్మా!
అలరు అరకును కుడిపి మన్నించు మమ్మా!
చిగురు వెలుగుల తళుకు తిప్ప మా తల్లి!
మొలక నవ్వుల మేరు కుప్ప మా తల్లి!
ఇంపు చూపుల చెరుగు చెలువ మా తల్లి!
మధుర మమతను పంచు ముదిత మాతల్లి!
అల నల్లనా వేల్పు ఆలి మా తల్లి!
అల వేల్పు నంగనగ నగమేలు తల్లి!
వాత్సల్య వారధగు వరద మా తల్లి!
బహుళ ఊర్పుల కూర్పు ఎరుక మాతల్లి!
ఏలు వాడగు నాధు నెద నొదిగి యుండి,
సంతు సందేశముల నెరుక జేసెడి తల్లి,
కనుసన్న కదలికన కరుణ చిలికే తల్లి,
మనుపుమో మా గతులు నెనరొందు నటులా!
భవసాగరపు డోల లాడలేకున్నాము,
భావ వైరపు పోరు నెరపలేకున్నాము,
బంధు బంధుల బంధు నెరగలేకున్నాము,
యద వెలుగు యదునాధు నెరుగ లేకున్నాము!
మతిమాలినీ సంతు మతి నేల మంచూ,
తనువు తప్పులు తరుగ దీవించు మంచూ,
జగతి భాగ్యపుకుప్ప నొరిగించ మంచూ,
జీవాత్మ బంధముల నెరిగించ మంచూ..
విన్నవించవె తల్లి వైకుంఠుడెరుగ,
సమయ సమయము నెరపు సందీయకుండా,
పలుమారు లెరిగించు పన్నగుని పడుచా,
పాలింపవే మమ్ము ముద్దు మురిపెములా!
పద్మ ఆలయమందు పద్మాక్షి నీవు,
కేసరంబుల దేలు కనకాంగి నీవు,
కరుణ కూర్పుల ఊర్పు అలివేణి నీవు,
అంబుజోదరునతివ ఆదుకొనవమ్మా!