ఆనతి

పూర్ణకాముడ నీకు పూరకములేలా?

లయకారుడవు నీకు లాలిత్యమేది?

ప్రమధ గణముల ఒజ్జ- ప్రధమునకు తండ్రీ!

చోటీయవే నాకు నీదు చరణములా!

గుణ వైభవములమర గురుతెరుగు నటుల,

గరుడ వాహనమెక్కి గతినొందు నీవు!

కామితంబుల కడలి డోల లూగే ప్రజ్ఞ,

పాన్పుగా జేసుకుని పవళింతు వేలా?

దివ్య తేజము నీవు – దీప కళికేల?

శాంభవీ పతి నీకు – శాకంబు లేలా?

సుధారసముల మునక – పానమది ఏలా?

పెదవి పలికే పలికు అలింప వేలా?

తొల్లి జేసిన లొల్లి చిచ్చులమరింప,

అయ్యవారల కార్య మవని నమరింప,

కుంభేశు సన్నిధిన మసలగా నేలా?

వింత యోగపు దారి నమరింప నేలా?

వెన్నెముక వైభవము వింత పోకడలొంది,

వన్నెగాడగు నీదు రూప ప్రతినను గాన,

నాటి అక్షరమాల నమరలేనీ రుచికి,

అనువైన కోశమును అమరింప నేలా?

దయనెంత జూపినా ఉధ్ధతొందని తనువు,

వెతల కంపాకమున కోర్వలేనీ ఉరము,

వైతరణి తరియింప తరుణ వైనమ నెంచి,

వికట వీధుల వెంట వదర నెంచే!

గుణము లెన్నకు నావి గురు రూపుడవీవు,

గుణము లన్నటి గుణము అయినవాడా!

గణ గుణంబుల గణన గని ఎంచగల నీకు,

లేమి గుణముల లెక్క నమరనౌనా?

పెదవి పలికే పలుకు, కరము జేసేపూజ,

పదము వేసెడి అడుగు – ఆనతింపు,

అద్దరెరుగని నాకు అంతరం బేమెరుక?

వింత పోకడమాని వినతి   గైకొనుమా!

Leave a comment