కిరణం…………

చెట్ల కొమ్మలు కదిలి కదిలేటి కిరణములు

లేత ఆకుల తాకి ఆగలే కురికేను,

వేగపడి కదిలేను అందుకొనగా నేదొ!

వడి వీడి నిలిచేను తెలియ జేయగ నేదొ!

 

కంటి నుండుదయించు కిరణ రాసుల కలిసి,

ఎరుక జేయగ నెంచు ఎల్ల లొల్లని తనము!

చెలువారగా బిలిచి చెలిమి జేయుచు సాగి,

చూపు సాగిన కొలది కనువిందు జేసేను,

మాధవుని మాయలో మైమరచు మధువనులు,

మాటనేర్వని ధ్వనుల మురిపించు వనజములు,

ఒల్లనన్నా వినని పాండు పుత్రుల మైత్రి,

కడలేని వైభవము కురిపించి మురిపించు,

దేవ సభలను మించు అస్తినల్లిన పురము,

కణము కణమున కరము కాపుగా నుంచియూ,

కనరాక కదలాడు జలజాక్షి వల్లభుని,

వరద హస్తపు నునికి కనగలుగు యోచనను,

విస్తారమున దెలుపు వెలుగు బాటలు పరచి,

ఎరుగుమోయిక నీవు కరగి పోయెను వయసు,

యుగయుగంబుల నుండి చెరిత లల్లిన మనసు,

ఆనాటి కానాడు అందుకున్నొక బోధ,

సమిధలుగ సమకూర్చి ఆది గురువును తలచి,

అడుగు అడుగున నడచి తోడు రమ్మంచు,

కడలేని కాలమున కనలేని తీరముకు ,

తోందరెరుగని తరిన తరలిపోతోంది!

అడుగడుగునా నాకు తోడు తానంది!

Leave a comment