గణ నాయకా! గణేశా!

వక్రతుండము గల్గు కురుచ ఒజ్జవు నీవు,

కాణిపాకపు కొలుపు కనికరించయ్యా!

కామితంబులు కుడుప కడుదొడ్డ రాయుడవు,

కంటకంబులు గడిపి కూరిమొసగయ్యా!

కడదేర్చు జనకునకు-మృగరాజ వాహనికి,

కృత్తికలు లాలించు శిఖి వాహనునికీ,

కూరిమిని గురిపించి – శివ కుటుంబము పేర్చి,

ప్రధమ పూజలనందు విఘ్నహరుడవు నీవు!

ద్వైతమెరుగని తనువు నమరినావయ్యా,

వ్యాస వాణిని రచన జేసినావయ్యా,

పరిహాసముల పరిధి పలువురికి ఎరిగింప,

రోహిణీ పతి గర్వ మణచినావయ్యా!

పానకము వడపప్పు చెరకు బెల్లపు ముక్క,

కుడుము లర్పణ నీకు  మోదమయ్యేను,

గరిక పరకల పూజ జిల్లేడు పూదండ,

మెండు దండిగ  నెంచి ఆన తిచ్చేవు!

చిరుత పాపడి వంటి చిరునవ్వు గలవాడ,

చెరగ జేయుము మాదు ఇడుములెల్లా,

చెలువంబు చిగురింప చలువ జూడయ్యా!

చేత లెన్నకు తండ్రి- చిరుత వాడ!

Leave a comment