గాలి తరక వ్యధ

మురళీ మనోహరుని ఊపిరిని పోసుకుని – రూపు దాల్చిన రవళి రమణీయ గమనముకు,

వాహనంబైనట్టి పవన భాగ్యము జూచి – మురిసేటి ముని వరులు వినరె ఈ వ్యధను!

 

పరిపూర్ణ కాము నంతరంగము జేరి – విశ్రమించెడి భాగ్యమొంది నా తెమ్మెరకు,

మధుసూధనుని మదిన మృదువుగా నడయాడి – పరవశింపగ నెంచు పిల్ల తెమ్మెరకు,

మాధవుని సేవలో తరియించు తరిలో – మరళిలో నర్తించి మురిపించగా నెంచె!

 

నిత్య సంచారియౌ తన జనకు ధామమున – నేర్చినా యోగమును మోహమందలది,

ఏటికో ఆ విభుని అలరింపగా నెంచి – వాని ఊపిరి యందు మోదమున నాదించె!

నర్తించు పదములిట పవన వాహనమెక్కి – మరలలే నేతరికొ తన్ను గొంపోవునని,

ఎంచలేనా తరక వేగపడి కదిలింది – స్వర సరంబులు మోసి మోసపొయింది!

 

కమలోద్భవుని రచన వెన్నంటి నడువగా – చంచలత్వము గొనుచు చరియించు చుంది,

జంతువులు, వృక్షములు, సాగరము లందు – ఊపిరై అనుదినము వర్తించు చుంది!

కక్ష కార్పణ్యములు, అలసత్వ భావములు – అహంభావపు టలలు, తామసపు తెరలు,

దీనత్వమున దేలు దుష్టయోచనలు – పేరొందగా లేని పలు వింత పొరలు,

ఆచిన్న తునకపై పాదమూనాయి   – నిజవాస వైభవము మరగు పరచాయి!

ఎన్ని యుగములు గడచె – ఎన్ని దొంతరలాయె – తన ఉనికి తానెరుగు తీరు గననాయె!

నీ సేవకై మసలి – నీ హృదికి దూరమై – తపియించి విలపింప ఏనేర మెంచేవు?

దాసాను దాసుడవు – భక్త వత్సలుడవు – నీవారి మోదింప మురళినూదావు,

పలు యుగంబుల శిక్ష గడచి నిను జేరి – నీ ఊపిరై నట్టి తరక తప్పేమి?

ఎరుక జేసెడి వారు ఎరిగింపగా రండు – రాధకై మాధవుడు మరళినూదేను!

Leave a comment