నండూరి వారెంకి నడుము సన్నపు మెరుపు,
ఉప్పొంగు గోదారి ఉరక నడకల దుడుకు,
పాపి కొండల నొరిసి కదుల కృష్ణమ కులుకు,
కలిగున్న అలివేణి కొలువు నమరింది!
కడగండ్ల కోనయగు కలియుగంపుకు కొలుపు,
తరుగుటెరుగని ఇడుము లెడలించగల వేల్పు,
ఆలికన్నా నాకు ఆర్తులే అధికమని,
హెచ్చరికగా నగము నమరున్న రేడు!
తలిదండ్రుగా నమరు యుగము నందున్నాము,
ప్రతి అడుగులో ప్రళయ ఘోష కంటున్నాము,
ఆదుకొమ్మని కోర అన్యులముగాము!
కనికరంబును గోర చరకులము గాము!
మన్ననందుట కొరకు మరగు చున్నాము,
సాయీద్యమును గోరి వేడుచున్నాము,
గోవిందుడవీవు గోపాలకుడవీవు,
ధరణి భారము దీర్చు దానవాంతకుడవీవు!
మత్సరంబులు బాపి మనుపుమోమమ్ము,
మధుర రక్షణ నెరపి మురిపింపుమమ్ము,
మాన్యడగు మా ధాత మహనీయుడంచూ,
మనుగడను ముచ్చటగ మనిపేము మేము!
గోవింద గోవింద గోవింద యనుచూ,
గోకులంబును దలచి ఆడేము మేము,
గోపాల గోపాల గోపాల యంచూ,
గాలి తరకలబోలి పాడేము మేము!