కొలను దాటని అలలు- కనులు దాటని కలలు,
ఊహదాటని భావమేతీరు నిను జేరు?
చేరికై చెలునిగా చెలిమీయ రాదా?
మనసు మరుపును మాపి తెలివీయ రాదా?
నారదారుల మదిన ఉప్పొంగు భారనకు,
వాణి దీవెన నిచ్చి మెచ్చిదరి జేర్చితివి,
నా అంతరంగమున ఊహగా కదలాడు
భావ వీచిక కేల నీ ఆనతందీవు?
చేరికై చెలునిగా చెలిమీయ రాదా?
మనసు మరుపును మాపి తెలివీయ రాదా?
అంకురంబుల ఆది కలిగున్న వాడవని,
బీజమై ఆనాడు జగము జొచ్చితివంచు,
మొలకైన ప్రతి మొదలు నీ యందెకలదంచు,
ఎరిగింతురే నిన్ను బీజముల కాదిగా!
చేరికై చెలునిగా చెలిమీయ రాదా?
మనసు మరుపును మాపి తెలివీయ రాదా?
ఏ బీజముల నంది ఋషిజనము మసలేరొ,
ఏ బీజభాగ్యములు యోగి దేహములాయె,
బీజ బీజము నందు శోభించు నీ శోభ,
రాహుకేతువులందు లుప్తమాయెనొ ఏమొ!
చేరికై చెలునిగా చెలిమీయ రాదా?
మనసు మరుపును మాపి తెలివీయ రాదా?
ఆనతుల దొంతరల అమరుండు ఈ జగతి,
అందె నెటులో నేడు తాలు బీజము నొకటి
అవని నడచిరి నేను అంతరమ్ములు లేక,
తరము లాయెను గాని తరిని గన నైతి!
చేరికై చెలునిగా చెలిమీయ రాదా?
మనసు మరుపును మాపి తెలివీయ రాదా?
అంతరంగపు పురము భేదించి రారా!
భావ పుంతల పైన పయనించి రారా!
వేదనాధుని రాణి మన్న నందిన మాల,
నీకు అమరించగల భాగ్యమందీరా!
చేరికై చెలునిగా చెలిమీయ రాదా?
మనసు మరుపును మాపి తెలివీయ రాదా?