అడుగు అడుగుగ నడచి అస్తమించే వరకు,
విశ్వమంతయు యున్న నిన్నెరుగలేనైతి!
విదిత మగుమోదేవ వివర మెరిగింపగా,
తరలి పోయే తనువు తరియించు నటులా!
ఎరుగ నేర్వగనైతి యమునగతి వేగమని,
ఎన్నగా లేనైతి నా పరుగు నెమ్మదని,
ఆతుగత నొందినే నందలే నా వడిని,
ఒడుపు నొప్పుమొదేవ దయగాంచి దరిజేరి!
వేదముల నాదముల నేనెరుగ లేను,
వైనతేయుని ఉనికి ఊహగన లేను,
వెలయు వాడటనీవు విధి విధములందు,
విధి రాతగా నేడు వెలుగొందుమయ్యా!
నిక్కమగు నియతి నను వెన్నాడుచుంది,
నిలువగా ఒక అడుగు అపరాధమంది,
కాలు కోదండమును వీడినా శరము,
ప్రారబ్ధమై నన్ను వేటాడు చుంది!
అలుపు బాపగనాడు అవని నడచావంట,
ఆలమందల గాచి జనుల బ్రోచితివంట,
మత్త గజమును గావ మంది మరచితివంట,
మరుగొందుగా నేడు మనసు నెంచితివేల?
కాలుండు కలగాదు-జగతి సత్యముగాదు,
అస్తినంటిన నేను విడివడుట భ్రమగాదు,
ఇడుములందలి ఇడుము-కలిమిలో కలిమి,
కలనైన ఒక మారు కరుణగొన వేమి?
దయ కరుణ దాక్షిణ్య గుణవైభవమును,
ఎన్నగా నా తపము తూగ గాలేదు,
నాఊహ ఉనికినే తగు తరిగ భావించి,
జాడ తెలియగజేసి దరిజేరు మయ్యా!