దండుకొనగా రండు – ధరణి నడిచెను ధాత,
దణ్ణమొక్కటె చాలు – దరిని జేరంగా!
నమ్మికతొ పనిలేక మన్నించు ధరణితరి,
తొలుగ జేయును తనువు ఇడుములెల్లా!
మునుపెందరో వాని పథముంది నడిచారు,
పెను భారముల గడచి మరులు గొన్నారు,
చక్కెరలు విబూది ఓషధిగ పనిజేయ,
వాని మహిమలు ప్రజకు పంచి ఇచ్చారు!
అట్టి చక్కెర నలక-విబూది చిటికె,
అందింపగా రారె విబుధు లెవరైనా!
తోలు చేతులు జేర్చి చేసినీ వందమనము,
దణ్ణమై ఆ విభుని జేర నేరక యుంది!
మనసున జేరిన వ్యాధుల పీడను,
మన్నికగా మట్టుబెట్టి మనుపగరాదే!
కరములు కదిలెడి క్రతువును,
దణ్ణంబగు దివ్య కిటుకు నేర్పగరాదే!
వసి వాడ నా వన్నె వివరించ గల వారు,
వీనులందున వాని నామ మూదెడివారు,
మిను వీధుల నడయాడుచు అచ్చెరొందేలా?
చిను కొక్కటి ఆ సురభిది కుడిపింపగ రాదే!
పంచిన పెరిగెడి నిధియట – పెన్నిధి ఒసగంగ పొంది,
పదుగురి కానాడు పిలిచి పంచిన వారే!
జోలెలు గట్టుక నేడిట వేడిన విననాయేలనో!
వాడిన బ్రతుకులు వేడుక!- తగునా ఇది మీకు?