నల్లనయ్యకు కొలుపు

శిశిర ఛాయలు ఇచట చిత్రమమరాయి,

తరువు తరువును తాకి ముదిమిగొలిపాయి,

చిగురాకు కొక రంగు ముదురాకుకొక రంగు,

రంగవల్లులు జల్లి  చోద్యమొసగాయి!

ప్రతిరెమ్మ ప్రతిఆకు అమరున్నప్రతి నెలవు,

పసిమి ఛాయను పొంది పొంగిపోయేను,

వనకన్నె తనువుపై తనఉనికి తేజమును,

మణిహారముల మించి సొంపు గొలిపేను!

హరిత చేలము పైన మెరయు పసిమినిజూసి,

మోదమొందే కనుల వాకిళ్ళలో నడచి,

గురుతెరుంగనివారి మదినింపి మోదింప,

సరసుడని నీసతులు నుతియింపరని ఎరుగు!

పాలకడలిన బుట్టి పసిడి ఛాయనుగల్గి,

పదసేవతో నిన్ను మురిపించు సిరి ఛాయ,

మేనియందమరితే మురిసేవుగాబోలు,

నెమ్మదించిది గాంచు వనజాక్షి వంద్యా!

క్షీరసాగరపలల మధనమున విడివడిన,

వెన్నతరకలు కరిగి మేలిరంగుగ అమరి,

నీమేని వస్త్రమున అలదినా ఛాయలకు,

మెచ్చి మా ‘సిరి’ నిన్ను పీతాంబరుండనియె!

పాలసంద్రపు కన్నె వరుని కట్నంబైన,

ఛాయ మురిపెము నొసగ సహజ భావంబే!

నీవు మెచ్చిన పొడను మెచ్చు వారల యందు,

మన్ననను అమరుటయు నిక్క నియమంబే!

లచ్చి మెచ్చిన ఛాయ ఎందెందు గలిగినా,

మురిపెమన ముద్దాడి మోదాన దేలేవు!

వక్షమందున అమరు అలివేణి అంతరము,

ఆదరముగా నెరుగ ఆదమరతువో ఏమొ!

అహమొంది దుర్వాసు పాదమాన్చిన యంత,

ఒల్ల లేకానాడు నినుబాసి వెడలగా,

సిరుల కుప్పను జేర పడినపాటెటు బోయె?

తల్లి దీవెన లేక తరియింపగా తరమె!

పసుపు గడపలులేక పలుకు పద్యము లేక,

ముత్యమంతగు నేతి దీపకళికలు లేక,

కడుపు కుడిచెడి కుడుపు కూడగట్టెడి ఎచ్చు,

అహమొంది మోదింప ఆదిలక్ష్మెటులోప్పు?

పాలెంత తెలుపైన పాలకుండలు నలుపు,

పండు వెన్నెల పంచు నిశిరేయి నలుపు,

మెరుపు తీగలు అమరు కారుమబ్బులు నలుపు,

వెలుగు శోభల నమర ఆధారమౌ నలుపు!

నల్లనయ్యవు నీవు నగకన్య సైదోడు,

సిరిమెచ్చి చోటడిగి చెంత జేరిన ఉరము,

శృంగార మమరగా పూజ లందుక నీవు,

కమలాక్షి కనులలో కాపురము నుండు!

Leave a comment