నిర్మొహియగునిన్ను ప్రేమమూర్తని పిలువ,
పలుక నొల్లక యుండ సమ్మతంబే!
నీవెరుంగని మోహమేరీతి మముజేరె,
జననిరో ఎరిగింపు మరగు లేక!
అనిమేష వై నీవు జగము గాచుచునుండ,
రెప్పమాటున రచ్చ ఎటుల రగిలే?
రవ్వంత అలసించి తరియించు తరిదెలుపు,
కావలెందుకు మాకు – అక్కుజేర్చు!
ఎరుగ గల ఎరుకవట – ఎరిగించు ఎరుకవట,
ఏమేమి ఎరుగగా తనువిస్తివో నాకు!
ఒల్లజాలను నేను ఈ తీరు తెన్నులను,
ఎరుగ నొల్లను నేను ఏ పాఠములనూ!
నీపాద మంజీర మువ్వసవ్వడి తోన,
కరకంకణపు క్వణత్కారముల తోనా,
మృదు మధురమగునీదు లాలి పదముల తోన,
దరిజేర్చి లాలించు – అలసియుంటి!