నీడలెరుగని వాని నీడను- నేడు కరుగగ నెంచెద!

కోతి పిల్లను బోలి – తెలివి గల తరినుండి,

తగులుకుంటిని నిన్ను కలనైన ఇలనైన,

నీవు జను పురములను వెంట వెంటన జొచ్చి,

వీడి పోయినయంత వెన్నంటి మరలితిని!

కన్నులో జేరి నువు్ చూపినది జూచితిని,

నీవెరుక జేసినది వీనులన్ నే వింటి,

రుచులు జూపితి వీవు రాగ మప్పితివీవు,

రంగులెరుగు మనంచు లీలజూపితి వీవు!

ఎరుక జేసిన నీవు ఎరిగించ లేనట్టి,

ఏవగింపుల ఎరుక నేనెట్లు ఎరుగొందు?

వింత ఎంపిక మాను ఎరుకైన వాడా!

ఎరుక గొనుమోనేడు నీ నీడ గతిని!

కాల గమనపు కఠిన గాడ్పులు,

మాయ జల్లెడి మోహపూర్పులు,

నీవు విడిచిన జాడ నొందెను,

ఎన్నడో నను మరుగు పరచెను!

జీవనాడుల జీవమై నీవొప్పగా నే దేహిని,

జాడదెలుపక మరలు నాడిక నేను జగమున అస్తిని,

ఎన్ని యుగములు, ఎన్ని పురములు, ఎన్ని లోకములాయెనో,

బడలి పోయెను నాదు జవములు – పట్టు ఓపిక తరిగిపోయెను!

పిల్లివై నువు నన్ను నడుపుము – పంచుమిక నీ సాహచర్యము!

సాకులెన్నకు సాక్ష్యమడుగకు – పున్నెకార్యపు మోపు లెదుకకు!

ఎరిగి యుండుము ఒకేఒక్కటి – నివు జూపని జాడలెరుగను,

నీవు నడువని దారు లెరుగను,

నడుపు వాడవు నీవె కాగా- నేరమెటు నాయందు నాటును?

వాదులాడుచు వేడుకొందకు – తరలుమిక నను దరి జేర్చగా!

Leave a comment