నేటి పూజ….

ఆది విష్ణుని ఉరము నాటలాడే తల్లీ,

ఆకాశ గంగలో స్నానమాడే తల్లి,

ముని మానసాంబుధుల మధన మీగడ తరక,

మోహనుడు పంచగా ఆరగించే తల్లి!

వెలయుటెరుగని వలువ వరియించు తల్లి,

వన్నె తరుగని నగల నమరించు తల్లి,

సహజగంధపు మేను సౌరభంబులు చిలుక,

యమున గమనములోన వడి ఒల్లనంది!

జీవ జాలమునందు వైశ్వానరుడగు పతికి,

ప్రీతి జేయగతాను ప్రతి వనరులో అమరి,

లెక్కమించిన రుచుల రంజింప జేయుచూ,

క్రీడించు కనకాంగి కరుణాంత రంగి!

భాను కిరణపు మెరుపు-శశికిరణముల మరుపు,

మజ్జగమ్ముల నిలుపు ముదమైన అదుపు,

లాలిత్యమున లలిత-క్రోధమున కాళి,

ఎన్నగా ప్రతిభావ భావనగు తల్లి!

ఏతీరుగా నిన్ను నా ఇంట పూజింతు?

ఏ ఆసనము పరచి ఓ తల్లి అమరింతు?

తేటపూవుల తేరు-ఉదయ కిరణపు పేరు,

ఎన్నగా ఏదైన తల్లి నీ ఉనికాయే!

ఊహ బంగరు కోట ఉద్యాన వనము,

లెక్క మించిన సరస పద్మ కుడ్జములు,

తల్లిప్రేమను తరక రంగరించిన నెలవు,

నిలిపినా నేనిటకు వేంచేయుమమ్మా!

నీవు నేర్పిన ప్రేమ నా కంటి కొనలలో,

చినుకు చినుకుగ జేరి నిన్ను కొలిచేను!

నీవు మీటే మాట నా ఊహ వాటికల,

నీపాదముల నంటి మురిసి పోయేను!

ఎన్నియుగములు బాసి ఎరుక కరువైనా,

నాటికిని నేటికిని నీకు తనయుడనే!

ఏమరుకుమో తల్లి ఏరుక లేదంచూ!

ఆదుకొనుమో తల్లి- తల్లి వేదనను!

Leave a comment