పట్టు కో

తనువశాశ్వత మంచు తగుల రాదంచూ,

తనువు గలిగినగాని తగులవే నీవు,

తనువులో తగిలున్న నిను గాంచు వరకూ,

తరింయింప తరి ఎరుక తెలుపవే నీవు!

ఆటుపోటెరుగనో గుణరహిత రూపా,

గుణము లన్నిట గుణము గలిగించు వాడా,

గురుతెరుగనో రోజు గురుతు జూపేవు,

నిలకడెరుగని నన్ను నిలువ నుడివేవు!

ఉభయ సంధ్యల తెడ్డు అలుపెరుగ కుందీ,

కాల వాహిని ఉరక ఓపలే నంటోంది,

నిన్న నేడులు లేక రేపెరుగనీ నడత,

నీకు నైజము గాని- తనువోప నందీ!

కాకాని కోటయ్య – వేటూరి శాస్త్రీ,

మెచ్చి జేరిన గురువ – కలి వేల్పు నామా!

పట్టుమోయిక చేయి పరిహాస మేలా?

పట్టు సడలక మునుపె పంచభూతములూ!

Leave a comment