పదము – పలుకు

తారకంబగు నంట తలచినీ పదము

తరియించునట తనువు తగిలినీ పదము,

తలపులో నిలుపంగ తగులదే పదము,

తరిని తెలుపగ నెవరు తెలియరే ఇపుడు!

ముమ్మూర్తులను మదుపు ముచ్చటగు పదము,

మూల వైభవ మూర్తి నెరిగించు పదము,

నిర్గుణుని నిజధామ మరిగించు పదము,

గురుతైన గురుమూర్తి గురుతైన పదము!

పెదవి పలికిన యంత పథమిచ్చు పదము,

భవరోగముల గడుపు ఘనమైన పదము,

పలుమారు పలుకగా పనిలేని పదము,

నిక్కముగ ఒకమారు పలికించరాదా?

మాన్యులగు మహనీయు లెరుగు ఈ పదము,

మదినెంచి నంతనే మై మరపు పదము,

ఎంచగా నా మదికి పలుకులే రావే!

పలుకు పలికించగల పరమాత్మ ఎవరు?

ఎరిగున్నరీతిలో నే పలుకు పలుకు,

చరిత తెలిపిన నడత నడువదే పలుకు,

పదములో చేవిపుడు చెరితకెక్కేనా?

బ్రతుకు భారముదీర్ప బదులీయ దేలా?

చిత్రమందలి నీరు దాహాద్రి దీర్చునా?

పొరిగింటి పొంగళ్ళు కడుపాకలార్చునా?

నడయాడి నాయింట నన్నేల రాదా?

కుడిపి కూరిమి తోడు దయసేయ రాదా?

Leave a comment