ఒంటివాడవన నంటినా?

ఒంటివాడన నంటినా? నా జంట వీడుమనంటినా?

ఎల్ల లెరుగని ప్రేమ తత్వపు ఎరుక గరుపుమనంటిగానీ!

నే నొంటివాడన నంటినా? నా జంట వీడుమనంటినా?

నరునివై వానరుల గూర్చుక – వైరి మోహము మాపుచూ,

వాని తమ్ముని శరణు విన్నప మంది బ్రోచిన వాడవే!

సూర్య చంద్రులు తోడుగా – వన వనరులన్నిటి తోడుగా,

నిన్నె నమ్మిన జనక పుత్రిని – జేర సందియమేలయా?

ఒంటివాడన నంటినా? నా జంట వీడుమనంటినా?

ఎల్ల లెరుగని ప్రేమ తత్వపు ఎరుక గరుపుమనంటిగానీ!

ఒంటివాడన నంటినా? నా జంట వీడుమనంటినా?

ఏల రావని పంత మాడెటి దైత్య దనుజుల గావగా,

లంపటంబుల తగులు నాడే పంతమెరుగని వాడవే!

రాజభోగపు లాలసను విడి – ఆలిగా నీ సేవ జేయగ,

కోరి జేరిన కోమలాంగిని కొలుపు కంపగ పంతమా?

ఒంటివాడన నంటినా? నా జంట వీడుమనంటినా?

ఎల్ల లెరుగని ప్రేమ తత్వపు ఎరుక గరుపుమనంటిగానీ!

ఒంటివాడన నంటినా? నా జంట వీడుమనంటినా?

దారిజేసుక నిన్ను జేరెడి – రక్కసుల రవమణచగా,

మోహమెరుగని మధుర నగరినివాసివై కొలువుంటివే!

రేయిపగలని భేదమెంచక -తగు సమయమేదని వేచియుండక,

రెప్పపాటును ఒల్లకే- నిను తలచు గొల్లల జేరవేలనొ!

ఒంటివాడన నంటినా? నా జంట వీడుమనంటినా?

ఎల్ల లెరుగని ప్రేమ తత్వపు ఎరుక గరుపుమనంటిగానీ!

ఒంటివాడన నంటినా? నా జంట వీడుమనంటినా?

కోరి కొలిచెడి వారలను ఏ కారణంబుల నొల్లవో!

వైరి మనమున వెంట తగిలెడి వైనమేమని అందువో!

తేట తెలుపుము తీరుగా ఈ ప్రేమ తత్వపు  తీరునూ,

తారకంబగు భావ మోహము మరగు నొందక మనుపుమా!

ఒంటివాడన నంటినా? నా జంట వీడుమనంటినా?

ఎల్ల లెరుగని ప్రేమ తత్వపు ఎరుక గరుపుమనంటిగానీ!

ఒంటివాడన నంటినా? నా జంట వీడుమనంటినా?

 

 

 

 

 

Leave a comment