ఆ నందనందను తోడుగా – ఆనంద మందిన గోపికా!
ఎంచుమా నను తోడుగా – ఆ మధుర భావన పంచగా!
నల్లవాడట – గొల్లవాడట – మాటు నొల్లని వాడట!
పొదుగు జేరెడి లేగ చందము- చల్ల జేరేడి వాడట!
||ఆ నందనందను తోడుగా – ఆనంద మందిన గోపికా!||
చేరవచ్చిన చెలియ నొల్లక – చలము జేసెడి వాడట!
వెదకగా తా కానరాకనె – కనుల నిండెటి వాడట!
||ఆ నందనందను తోడుగా – ఆనంద మందిన గోపికా!||
వెదురు బొంగులనూదుచూ – తన జాడతెలిపెడి వాడట!
చేరుదారుల జాడలను తా-మదిని నింపెడి వాడట!
||ఆ నందనందను తోడుగా – ఆనంద మందిన గోపికా!||
జగతి దారుల జాడలో- తా నడువ నొల్లని వాడట!
తాను నడచెడి దారికే జాడనొల్లని వాడటా!
ఆ నందనందను తోడుగా – ఆనంద మందిన గోపికా!
ఎంచుమా నను తోడుగా – ఆ మధుర భావన పంచగా!