చెవినొగ్గు మనసా!

పాపచింతన మాని గురుపదంబుల తలచి ,

పరమ పథమందగల పథముగను మనసా!

పలుతెరంగుల తిరిగి తళుకు తోపుల తగిలి,

నశియింపగా నలిగి వగవగానేలా?

వరదుడగు మహరాజు వద్దనున్నాడంచు,

పలుకు పెద్దలమాట మన్నించు మనసా!

సాధుజన పాలకుడు సమయ సారధివాడు,

సాక్షిగా నిలచునట సకల సమయములా!

పాపచింతన మాని గురుపదంబుల తలచి ,

పరమ పథమందగల పథముగను మనసా!

పలుతెరంగుల తిరిగి తళుకు తోపుల తగిలి,

నశియింపగా నలిగి వగవగానేలా?

తెరపెరుంగని రేయి భీతిగొలపగ నీవు,

తెగుదారి వేదుకకే మనసా!

సావధానమునొంది పార్ధసారధి తలపు,

నియమముగ నిలుపుకొను మనసా!

పాపచింతన మాని గురుపదంబుల తలచి ,

పరమ పథమందగల పథముగను మనసా!

పలుతెరంగుల తిరిగి తళుకు తోపుల తగిలి,

నశియింపగా నలిగి వగవగానేలా?

అవధెరుంగని అంధ అంబుధని తలపోసి,

అలుపేల నొందేవు మనసా!

ఆదరించెడివాడు ఆవరించుండెనను-

ఆర్యోక్తి నందుకొను మనసా!

పాపచింతన మాని గురుపదంబుల తలచి ,

పరమ పథమందగల పథముగను మనసా!

పలుతెరంగుల తిరిగి తళుకు తోపుల తగిలి,

నశియింపగా నలిగి వగవగానేలా?

సోహమందలి హంస – ఎరిగించు సత్యమును,

నిలుకడగ ఎరుగుమో మనసా!

సోమశేఖరు జాడ జగమంత నిండెనని,

తలపు తలపున నిలుపు మనసా!

.                                                                           పాపచింతన మాని గురుపదంబుల తలచి ,

పరమ పథమందగల పథముగను మనసా!

పలుతెరంగుల తిరిగి తళుకు తోపుల తగిలి,

నశియింపగా నలిగి వగవగానేలా?

Leave a comment