నవరంధ్రముల నౌక

నవరంధ్రముల నౌక నడయాడు నౌకా,

నావికత్వము నీది నావికుడ నేను!

నవరంధ్రముల నౌక నడయాడు నౌకా,

నాయకత్వము నీది నావికుడ నేను!

లంగరెరుగని నౌక-లయమొందు నౌకా,

లాలించు ఈజగతి లాస్యమీ నౌకా,

లోనున్న లోకముల నెరుగదీ నౌకా,

లేశమంతగు నిలకడోర్వదీ నౌకా!              ||నవరంధ్రముల||

మిత్తి దారులబట్టి మసిలేటి నౌకా,

మితిలేని మోహమున మైమరచు నౌకా,

మీదున్న బడబాగ్ని నెరుగదీ నౌకా,

మిగులు భాగ్యపు మదిర పుంత ఈ నౌకా!        ||నవరంధ్రముల||

తళుకు చుక్కల వెలుగు చుక్కాని యౌనౌక,

తెలియ నెరుగని తీరమేగు నీ నౌకా,

తరలించు వాడవని తగిలితీ నౌకా,

తుదిలేని తావునకు నడిపించు నౌక!        ||నవరంధ్రముల||

Leave a comment