నాదమై నడయాడు నారాయణా!

నాదమై నడయాడు నారాయణా నీవు,

నాదించు నాలోన నారాయణా!

భక్తి భావన నాది నారాయణా,

నా పలుకు లో కులుకు నారాయణా!

ఆది నాదము నీవె నారాయణా,

అమరిస్తి వీ జగతి నారాయణా,

భావరూపము నీవె నారాయణా,

భావింపగా నీవె నారాయణా!

నాదమై నడయాడు నారాయణా నీవు,

నాదించు నాలోన నారాయణా!

చిలుకలో చిరుతలో – చెలరేగు ధృతిలో,

నందీశు నాధు పద మంజీరముల లోన,

మత్త మధుపపు మంద ఝుంకారముల లో,

గూడుకొక నాదమై నయము నమరే వాడ!

నాదమై నడయాడు నారాయణా నీవు,

నాదించు నాలోన నారాయణా!

బ్రహ్మమానస పుతృ గానమందున భక్తి,

శంభునిల్లాలి ఆ పలుకు లందనురక్తి,

ఋషిపుంగవుల స్తుతుల వెల్లివిరిసే కొలుపు,

పొందికగ పొదిగినా వైభవంబుల రేడ!

నాదమై నడయాడు నారాయణా నీవు,

నాదించు నాలోన నారాయణా!

తనువొంది లోకమున తల్లడిల్లె సుతుని,

మరపించు జోలలో లాలిత్యమై నీవు,

పలుకు లల్లేతల్లి పేర్చు పలుకుల వెల్లి,

భావనల భూషణము లమరించు గాదా!

నాదమై నడయాడు నారాయణా నీవు,

నాదించు నాలోన నారాయణా!

అస్తి అస్తిన నీవమరుంటి వను ఎరుక,

విదితముగ నెరిగించు నారాయణా!

నీ నాద భావనల భావమెరుగగ జేసి,

బ్రతుకు భారము దీర్చు నారాయణా!

నాదమై నడయాడు నారాయణా నీవు,

నాదించు నాలోన నారాయణా!

Leave a comment