రెప్ప లేని కన్ను

రెప్పలేనొక కన్ను రేయన పగలనక – బాహ్యంతరము లేక తెరపి లేక,

కాపుగా నుండునని కరుణ కురిపించునని -కనగలిగి మన గలుగు  చూపెపుడు ఉదయించు?

రెప్పలేనొక కన్ను రేయన పగలనక..

తరగుటెరుగని చింత చింతామణిగ మారి – సుధారస సారముల సంగమెటు గలుగూ?

సంగమెరుగని సంగ మమరియుండంగా – సావధానము నొందు సాధ్యమెటు గలుగూ?

రెప్పలేనొక కన్ను రేయన పగలనక..

సారహీనంబైన సకల కాలములందు – సాక్షియగు ఆ చూపు ఏమనెరించూ?

వీనులందున ఊది ఊరడింపగ జేయ – జాగుజేసెడి వాని జాగెటుల తొలగు?

రెప్పలేనొక కన్ను రేయన పగలనక..

నిలకడెరుగని మనసు నియమ పాలనలేక – వేదనల వనములన బీతిగొని చరియింప,

నిమ్మదింపగ జేయు జాలమేదని తలుప – బదులు పలికెడి చూపు ఏమనెరిగించు?

రెప్పలేనొక కన్ను రేయన పగలనక – బాహ్యంతరము లేక తెరపి లేక,

కాపుగా నుండునని కరుణ కురిపించునని-

ఎరుక జేయుము తల్లి తలపు తెర తొలగించి- నా మంద భాగ్యంబు కనుమూయకుండా!

రెప్పలేనొక కన్ను రేయన పగలనక – బాహ్యంతరము లేక తెరపి లేక,

కాపుగా నుండునని కరుణ కురిపించునని -కనగలిగి మన గలుగు  చూపెపుడు ఉదయించు?

రెప్పలేనొక కన్ను రేయన పగలనక..

Leave a comment