శ్యామలవు శారదవు శతరూపి నీవు – క్షయమొందగాలేని అక్షరము నీవు!
ఆదినాదములోని అంకురము నీవు – ఆదరింపుము మమ్ము అనురాగ వల్లీ!
సోహమందలి చిలుక ఎరుగగా లేదు – తనఛాయ నీ శకట రూపుబోలేననీ,
అల్లార్చు రెక్కలన రవళించు రాగములు – రంగరించిన అరకు రుచియందు నెలకొల్పి,
నీదివ్య గుణములను పలికించుకొమ్మా!
శ్యామలవు శారదవు శతరూపి నీవు – క్షయమొందగాలేని అక్షరము నీవు!
భాషభావపు రతిన ప్రభవించు పదములో – నీ పదము మోపుమో మంజుఝరి ముదితా!
మోహనంబగు నట్టి ‘పద’ పద్మముల మాల – అలరింపుగా నీకు అర్పించు తెరపిమ్ము!
శ్యామలవు శారదవు శతరూపి నీవు – క్షయమొందగాలేని అక్షరము నీవు!
ఆదినాదములోని అంకురము నీవు – ఆదరింపుము మమ్ము అనురాగ వల్లీ!