స్నేహము

ఆలయంబున అమరు వేల్పులు వరదులని నే వేడబోతే,

పూజక్రతువులు, దీక్షధ్యానపు బదులు నిమ్మని నుడివినారు!

వరుస గలుపుక వచ్చిచేరెడి బంధు జనముల సుఖములన్నీ,

వన్నెకెక్కిన వారిజాక్షిని వలచి వచ్చిన వైనమే గద!

జన్మనిచ్చిన తల్లిదండ్రులు వారు పంచిన ప్రేమ బదులుగ

మలివయస్సున సేవ గోరుచు-వారి బదులని ఎంచినారు!

ఆలి సేవల ప్రేమలాలన బ్రతుకు బాధ్యత బదులు కోరెను,

విద్యగరిపిన గురువులెల్లరు దక్షిణంచూ బదులు కోరిరి!

బదులు కోరని మధురబంధము-వెన్నుజూపని బ్రతుకు బంధము,

యుగయుగంబులు గడచిగూడా- వాడి ఎరుగని స్నేహబంధము,

జగమునందిల చాటగా పరమాత్మ నిల్పిన ఆత్మబంధము,

ఎరుగరే మీరెల్లరింకను – పార్ధుడందిన కిృష్ణ    స్నేహము!

అన్నదమ్ములు అక్కచెల్లెలు ఆడపడుచులు అత్తమామలు,

లెక్కమించిన వరుసలెన్నో మనిషి బ్రతుకున అల్లియున్నా,

మౌనమానస యోచనలలో తర్కమెంచని తోడునీయగ,

పెక్కుమోముల పెద్దవారలు స్నేహబంధము కూర్చినారు!

Sent to Mytales – poem contest  : on 16th July 2017

Leave a comment