వరద

కరిగాచిన వరదుడ వని – కనకాంగికి వేలుపువని,
కమలాసను ప్రభవించిన చిరు బొజ్జను కలిగితివని,
యోచన మునిగిన లోచన లోకంబుల నేలేనని,
పలువురు దెలుపగ నమ్మితి గతి నీవని ఇలనా!

పద్మాసను పలుకులన్ని హరియించిన సురవైరిని
పలుమారులు హరి యనగా క్రోధించిన ఇంద్రారిని (ఇంద్రారి – రాక్షసుడు)
ముజ్జగముల పాలకుడౌ సురనాయకు గతిమాలిని,
ఒడుపుగ అక్కున జేర్చిన అనఘవు నీవని నమ్మితి! (అనఘ – నిర్మలము / మనోజ్ఞము)

హరి నామమె అరిబాధల హరించెడి గరళంబని,
తనువాడెడి తరినుండి తలచిన దానవబాలుని,
కనుసన్నల కదలాడగ పూరకమై పురినిండిన,
సింగపు తలగల నరుడవు గతినాకని నే నమ్మితి!

గగనపు ఛాయన మెలిగెడి గగనాంతర వాసివైన,
గమనము మరచిన కాలపు గతినందిన దృతివైనా,
గారవమొందెడి గోపిక నగుమోమున మొలకవైన,
నీరజనాభా నాకిక గతినీవని మదినెంచితి!

యోచన ఏలయ చేరను దయనెంచను తగనంచు,
వెన్నెల కురియక కలువలు పంకముపాలైన పగిది,
పంకజనాభా నీదయ కురియక నేనెటుల మనదె?
మాధవ మాదరిని జేరి మనుపుము తండ్రీ!

Leave a comment