సంధ్య

మెరుపు అంచుల మబ్బు మాటున – మాటువేసిన కలువ వైరికి,
వన్నెచిన్నెల మబ్బు తునకల – ఆట పాటలు తెలియునా?
చెదరి జేరిన వెలుగు చినుకుల – చేర్చి అల్లిన మెరుపు చెండును,
మురిపెముగ తమ కురుల తురుముక – మోదమొందే తీరులు!

ధరణి దాహము తీరగా ఒక చినుకు నిమ్మని వేడుచూ,
చిలిపిగా ఆ ముదిత తోడుగ వరుణుడాడే ఆటలూ,
అలుకలొలికే కులుకుతో ఆ తునగ నడిచే నడకలూ,
చూచు కన్నులు కలిగియూ తా చూడడెందుకు ఎన్నడూ!

వేడుకొందగ వేళగాదని తొలగి పోయే తీరులు,
వెరపు తగదని వైనమేనని కొసరి జేసే కబురులు,
తాళజాలక తనువు కరుగగ వీగిపోయే మబ్బులు,
ఊహచందము కన్నులారగ గాంచదెందుకు తీరుగా!

మయుడు అల్లిన మాయదుప్పటి మాటువీడుట ఎన్నడో!
మనసు మురియగ మదనమోహను లీలగాంచుట ఎన్నడో!
వీగిపోయే తనువు తొందర నెమ్మదించే దెన్నడో!
సోలుటెరుగని రవికి రమ్యత రుచులు తెలిచేదెన్నడో!

Leave a comment