ఎల్ల వాసములందు వసియించు వాడెవడు ?
వైనమేమది వాని నెరుక గొనగ?
తెలుపవే నా తల్లి తేట పలుకుల కలిపి,
ఏమరక నే నెరిగి మసులుకొనగా!
వాసమేదని ఎంచు వైనమెరుగనివాడు,
వాసమౌనది వాని ఉనికి వాలన,
వాని ఉనికిని వీడి వీగిపోవీ జగతి,
వాసుదేవుడు వాడు ఎరుగు తండ్రీ!
రూపు రేఖలు ఏవి? ఎవరి పుత్రుడు వాడు?
గురుతు దెలుపుమూ వాని నెరుకగొనగా!
పలుమారు లడుగకే పలుకవే నా తల్లి,
ఏమరక నేనెరిగి మసులుకొనగా!
ఆది దేవుడు వాడు ఆద్యంతమును వాడు,
అమరుండు నీ జగతి అణువులెల్లా,
అలికిడందున వాడు ఆలకించెడి వాడు,
అంతరంగము నందు నెరుగు తండ్రి!
అంగమెరుగని వాని నే పురము నే గాంతు?
అవని అంచులనేను అందలేనే!
ఆదరము నెరిగించు అనురాగముల తల్లి,
ఏమరక నేనెరిగి మసలుకొనగా!
అంగాంగముల నాడు జీవనాడులు వాడు,
అవని ఉనికిన నిండి ఉండువాడు,
అవధులెరుగని వాడు అవధెవాడగువాడు,
అండవాడే నీకు ఎరుగు తండ్రీ!
అన్నపానము లేమి ఏమి కుడుచును వాడు?
అందనెంచును ఏమి ఆదరమునా?
ఏరీతి నర్పింతు నెరిగింపుమో తల్లి
ఏమరక నే నెరుగి మసలు కొనగా!
కుడుచు కుడుపులు వాడు కుడిచెడదియును వాడు,
అందునే కుడుపైన ఆదరమున,
అందించు అంతరపు ఆదరంబేగాని,
కడుపు నెన్నడు వాడు ఎరుగు తండ్రీ!
నామ మేమది వాని నోరార పిలువంగ?
వాడు మెచ్చెడి నామ మేది దెలుపు
నలుగు రెరిగెడి రీతి నెరిగింపుమో తల్లి,
ఏమరక నే నెరిగి మసలు కొనగా!
నామమొకటని లేదు ప్రతి నామమును వాడె,
నామ మెరుగని వాడు నాది వాడు,
నామమెంచక నాద భావంబు వినువాడు,
ఆది నాదము వాడె ఎరుగు తండ్రీ!