తప్పులెన్నక గాచు గట్టి దేవుడవంటె –
నను తుంటరని ఎంచి తొలగుందువేమో!
గొల్ల పల్లెల నాడు మా మంచి దొర యంటె,
చల్ల ముంతల దోచ రమ్మందు వేమో!
నల్లనయ్యా నన్ను ఉడికించ కయ్యా!
నీ లీల దెలియ నా తరము గాదయ్యా!
విజయు మెచ్చిన మంచి వన్నెగాడవనంటె,
కరకు దారుల నడువ రమ్మందు వేమో!
పాల్కడలి చిన్నారి పెనిమిటివి నీవంటె,
కడలి చిలకగ కదలి రమ్మందువేమో!
నల్లనయ్యా నన్ను ఉడికించ కయ్యా!
నీ లీల దెలియ నా తరము గాదయ్యా!
కరుణాల బాల నను కరుణ చూడు మనంటె,
కరిగి కన్నుల జేరి కవ్వింతు వేమో!
కాలయవనుని బ్రోచి కడదేర్చినా రీతి,
ఆటగా నను జేరి పూడ్ఛరావయ్యా!
నల్లనయ్యా నన్ను ఉడికించ కయ్యా!
నీ లీల దెలియ నా తరము గాదయ్యా!