ఆత్మ బోధ

ఆర్తి దీర్చెడి వాడు అణువణువునా వుండి – ఆవరించుండునని ఎరుగవే మనసా!

అంధకారపు వెరపు అవధి దాటేనంచు – ఆయాస పడనేల మనసా?

నిలవరింపుము వెఱ్ఱి మనసా!

పగలు రేయీ నిన్ను పరికించి చూడంగ – సూర్య చంద్రులు ఆయె మనసా!

ఆ సామి కన్నులను కనుల జూడక నీవు – పలవరించే వేల మనసా?

వాదులాడుట మాను మనసా!

వద్దు పొమ్మని నీవు వెడల నడిపిన గాని – ఊపిరై జేరునే మనసా!

గాలి తరకగ జేరి తనువు నిలిపెడివాని – జాడనెంచ వదేల మనసా?

జాగేలనే నీకు మనసా!

ఎన్నడో ఒకనాడు ఎరుక పరచిన తెలివి – నిలిపి నీ కెరిగించు మనసా!

వాడు తొలగిన నాడు తెల్లబోవును తెలివి – తునకలై పోవునే మనసా!

తుది గడియ నీకదే మనసా!

వగచు కన్నుల తాను నీరుగా ఉప్పొంగు – తల్లి చన్నున తాను పాలుగాను,

తనువొల్లనా తిండి తనువు బైటకు నెట్టి – తనువు గాచును నీది మనసా!

తగిలుండునే నిన్ను  మనసా!

తీరు తెన్నూ లేని దారి నడిపేనంచు – దెబ్బలాడకు వెఱ్ఱి మనసా!

వింత దారుల జగతి వివరమెరుగక వేచి – విశ్రాంతి నొందవే మనసా!

విసిగి వేసారకే మనసా!

దారిలేనొక దారి నడచునీ జగమెల్ల – నింగి తారల జూడు మనసా!

యుగము గడచినగాని ఎరుగరే ఏదారి – మనుగడెంతని నీది మనసా!

మారాము మానవే మనసా!

నీదిగానీ తనువు తొలగి పోయేనాడు – తోడెవ్వరే నీకు మనసా!

నిదురలో నినుగాచు నీరజాక్షుని ఉనికి – తెలసి తగులవదేల మనసా?

తరియింప తలపవే మనసా!   తారకంబదె నీకు మనసా!

Leave a comment