నిలువని కాలము

ఏదీ నీ సంచార జాడ ఎదగట్టుట లేదే ,

మంజుల భావపు కుంజము అగుపించుట లేదే!

అద్దరి జేర్చటి నావీ కనుచూపున లేదే ,

కమలాకర పొడ గట్టర కన్నుల కిపుడైనా!

ఆగని కాలపు వాహిని తరలించుకు పోకమునుపె,

తనుభారము బహుళంబై తెగి వీగక ముందుగానె,

భస్కర పుత్రుడు నాకై కబురంపక ముందుగానె,

తెలియగ జేయుమ నీదయ తాపంబులు దీరా!

వెలుగులు తరిగీ కన్నులు మరుగున జేరక మునుపే,

చేతన ఉడిగీ చేతులు చేతల వీడక మునుపే,

వీనుల వాకిలి తలుపులు మూసుకు పోవక మునుపే,

వేడుక గాదిది వేగమె కరుణింపగ రారా!

మరి రానని నా ఊపిరి మరలగ నెంచక ముందే,

అశ్రాతపు నా నాడులు శాంతింప ముందుగానె,

ఊహల మెదిలెడి భావము ఊనికి వీడకముందే,

విశ్వాంగుడ వివరింపర నీదయ వివరముగా!

ఏదీ నీ సంచార జాడ ఎదగట్టుట లేదే ,

మంజుల భావపు కుంజము అగుపించుట లేదే!

అద్దరి జేర్చటి నావీ కనుచూపున లేదే ,

కమలాకర పొడ గట్టర కన్నుల కిపుడైనా!

Leave a comment