గోవుల గాచెడి వాడట – గోపీజన వల్లభుడట,
గోపాలుర గూడి ఆడి మోదించే గోపకుడట!
గొడుగుగ గోవర్ధనంబు నిలిపిందీతండేనట,
గొనునట ఏ పూజైనా గోవిందాయనగా!
సిరి మెచ్చిన శ్రీకరుడట – శ్రీవత్సము గలవాడట,
మణి మాణిక్యపు కొల్లలు వెల్లువ గలిగినవాడట,
చల్లన దేలెడి వెన్నకు వెనుకాడని పసివాడట,
పన్నగసాయి అంటే పాపము హరియించేనట!
ముల్లోకపు మూలంబును కడుపున కలిగినవాడట,
ముచ్చటగా గోపెమ్మల విసురుల నందెడివాడట,
మునుగడచిన యుగములన్ని వివరముగెరిన వాడట,
మూసిన కన్నుల లోపల కదలాడే దొరవాడట!
కామిత వరదుడు వాడట – కారణ మడుగని వాడట,
హరిరూపమె హరియంచు మాయన మునిగిన వానికి,
హరిరూపము నందజేసి మోదముగా మదమణచిన
జగమెరిగిన ఈశుండీ తుంటరి మాధవుడేనట!
(శ్రీ నారద మునీంద్రులు ఒకానొక సందర్భంలో ఒక రాకుమారి శ్రీహరిని వరిస్తుందని తలిసి, హరి మాయ వల్ల ఆమెను మోహించి, తనకు శ్రీహరి రూపము ఉంటే మాగుండును అనుకొని, ఆ పరమేశ్వరుని తనకు ఆ లీలామానుష స్వరూపుని రూపము ఇవ్వమని అడిగాడట. అప్పుడు ఆ పరంధాముడు నారదునికి తన శరీర ఆకృితిని ఇస్తూ శిరస్సు మాత్రా ‘హరి’ (కోతి)ది ఇచ్చాడట. ఆ పరాభవానికి ఉగృడైన నాదుడు (శ్రీరామావతారానికి నాంది పలుకుతూ,) ” ఒక నాడు నీ కార్యం నెరవేరడానికి కోతి ముఖం గలవారినే శరణు వేడెదవుగాకా’ అని, భక్తసులభుడైన ఆ వైకుంఠుడిని శపించాడట. )
పూలను మించిన మెత్తటి శ్రీసతి కరముల సేవలు,
శేషించని సోయగమున అమరిన శేషుని తల్పము,
మోదముకై అమరియున్న ముల్లోకపు కల్లోలము,
అందెడి లీలాలోలుడు గోకుకలమున ఆడేనట!
అంతటి ఆ మహనీయుని జంటగ ఆడినవారలు,
పంతముతో వైరమొంది రణమున పోరిన వారలు,
రారా యని ముద్దుజేసి బుగ్గలు పణికిన వారలు,
ఏరీ ఈ ధారుణి పై స్థిరముగ నుండగ లేదే!
తెరపెరుగక మరుగగునీ మహిబుట్టిన వన్నీ,
కారణమడుగని కాలుడు తరలించును అన్నీ,
తెరిగొనగా తగియున్నది తారక నామంబొకటే,
తొందర నొందుము తగులగ తర్కమువిడనాడి!