శ్రీమన్నారాయణు యజ్ఞవరాహ రూపం ధరించి దేవతలకు సంతోషం కలిగే విధంగా హిరణ్యాక్షుడితో యుద్ధం చేస్తుండగా – ఆ తాకిడికి తట్టుకోలేక సముద్రుడు పొంగి ముల్లోకాలను ముంచాడు – అన్న సంఘటనకు …
పెను రక్కసుడు జేరి పెకలించె పురినెల్ల,
జీవజాలంబెల్ల కొల్లబోయె,
ధాత్రినక్కున జేర్చి గొంపోయె తనపురికి,
దిక్కుదోచన నేను బిక్కనుంటి!
వల్లమాలిన వాడు వదులడే ధారుణిని,
ధాత సంతతి నడలి ఏలుకొనను,
వెలికి వానిని బంప వైన మెరుగను నేను,
జగము గాచెడి వాడు అరుగువరకు!
అల్లదే అరుదెంచె అరుదైన రూపమున,
అవని గావగ వెడలె ఆర్త హరుడు,
అంది యా పాదమును తరియింతునే నేను,
తరతరంబులవరకు తరిని గొనగా!
హతమార్చగా అసురు అందినా రూపంబు,
వరహావతారమని మునులు పొగడె,
మునుపెన్నడెరుగనీ ఆవేశమును బొంది,
ఆడెనే ఆ సామి నాదు ఒడిలో!
ముట్టె తగిలిన నన్ను మద్దాడెనని ఎంతు,
గిట్ట దగిలిన నాదు భాగ్యమందు,
సిరి మెచ్చినా పదము కోరి ఊనగ నాకు,
తరమౌనె ఏ తపము జేసియైనా?
మేని రోమమునంటి తరియించె జలరాశి,
మేలు సేయగ నేను మనుగడెల్లా,
శమియించె మదమెల్ల పెను ఘాతములనంది,
శేష శయనుని మేని వర్ణమంది!
తిరిగి తిరిగీ సామి తిమిర లోకములందు,
దృంచె నసురుని దెచ్చె ధరణిపైకి,
పంకమంటిన మేను ప్రేమతో సవరింతు,
అలల చేతుల తోన తనివిదీరా!
ఎన్నడో మరియింక ఆసామి నే జూతు,
జగము లే లెడివాని నంద గలనే!
భాగ్యమన్నను నాదె జలకంబులాడింప,
జగము లాడించేటి విభుని నేడు!
గంగబుట్టిన పదము పలుమారు లాడగా,
పరమ పావనమాయె జలములన్నీ,
పున్నెంపు మునకలని పున్నమికి మునిగేరు,
యుగము నాడెడి జనులు భక్తిమీర!
ధవళ వర్నపు మేను ధరియించి నాసామి,
గాచి దెచ్చిన పుడమి నేలు వారు,
కొనియాడరే వాని వరహావతారుడని,
ధరణిచ్చి గాచెనని ఆయువంతా !
శుద్ధ వర్ణము నంది వరహావతారుండు ,
గాచి దెచ్చిన భుమి నడచువారు,
కల్పంబు పేరిడరె శ్వేతవరాహంబంచు,
కదలాడు ప్రతిజీవి వాని తలువ!