కబురు

మహతీ నాదము పంచుచూ ఈ జగము దిరిగెడి దేవరా!

నాదలోలుని దయను పొందెడి దారి దెలుపుము తీరుగా!

వాడ వాడల నడచు వేళల వైనతేయుని ఏలువాడిని,

జంట బాయక వెంట గైకొని వెడలు తీరును దెలుపవే!

వాదులాడుట మాని నామది వాసుదేవుని నామ పానము,

కోరి కొసరుచు అంది మసలెడి దారి దెలుపుము దేవరా!

గగన వీధుల దేలుచూ ఈ జగము వింతలు జూచుచూ,

సురగంగ బుట్టిన పాదమును నీ మానసంబున తలచుచూ,

తగిన దిదియని తగదు ఇదియని తలుప నేరక ఎంచుతచూ,

తామసాంతకు తగిలి యుండెడి తీరు దెలుపుము దేవరా!

పలు విధంబుల పలుకరించే వసుధ శోభల ఉనికిలో,

పాపహరుడగు మాధవుని నీ కనుల గట్టగ చూచుచూ,

కర్మ బంధపు కొలిమిలో చిరు సమిధలౌ ఈ జీవుల,

ఇడుము దీరెడి ఇందువదనుని నామమొసగ నెంచవా?

వసుధ మరువని వల్లభుని ఈ వాసులేమని మరతురో,

వల్లమాలిన మాయ చెరగున చేరి మురిసేదేటికో,

కలలు మానా కలువ కన్నులు నిన్ను గాంచెటి వేళలో,

వేడి ఎరుగుము దేవరా మా పాటు మాపెడి తీరును!

పాలసంద్రపు ఇంతి సేవల సేదదీరెడి వేళలో,

పుణ్యపురుషుల పూజలందుక మోదమొందే వేళలో,

దారిజేసుక దరిని జేరిక కబురు దెలిపే వేళలో,

తెలుపుమా ఆ పద్మనాభుకు నన్ను కన్నుల జూడగా!

Leave a comment