దిక్కు నీవని నమ్మి – దీనతొందుట మాని,
ధీమంతనై మసలు ధీరతొందెటి తరిని,
దివిజేంద్ర వందితా – మన్నించి ఎరిగించు,
దివ్యుండు దరిజేరి తరలు మనులోపు!
అందుబాటున ఉన్న అందలేననుకుంటె,
ఆవేదనధికమై బ్రతుకు బడలు,
అవని అంచులపైన ఎక్కడో కలవంటె,
అందు తరి లేదంచు బడలు మనసు!
పాల్కడలి డోలలకు తూగు పానుపు పైన,
సిరి కొలువగా మురిసి పవళించు సామి!
కలువ కన్నుల కలల ఆడేటి బొమ్మనని,
మోదమొందుచు నన్ను పరికింతువేమో!
కలనీకు ఇలమాకు కావుమో దేవరా,
కలలోని నను జేరి కరుణ జూడు,
నీ ఊహ ఊపిరుల ఉయ్యాల జంపాల,
ఊపు తాళగ గల్గు తీరు దెలుపు!
ముని కంటి చెర నీకు మచ్చటైయ్యేనో!
మౌని మానస వనులు మరులు గొల్ఫేనో!
మాధవా యని చేరు గోపకాంతల గూడి,
మాపు రేపూ యంచు నన్ను మరచేవో!
నంద నందన యంచు భావించుటే గాని,
సుందరుండగు నిన్ను గాంచలేను,
మందగించిన నాదు భాగ్యంమ్ము సవరించి,
బృందావనోల్లాస మనుపు నన్ను!
తనువిచ్చి ఆడించి మోదింప తగునీకు,
ఆడించు నిను దెలియ తగద మాకు?
ఆట ముగిసే లోపు ఎరిగించు నీ ఉనికి,
శ్యామసుందర సంధ్య చేరువాయె!
(దివ్యుడు : యముడు)