పృథుమహారాజు దీర్ఘ సత్రయాగం చేయ సంకంల్పించినప్పుడు, తన పాలనలో ఉన్న ప్రజలకు శ్రీమహా విష్ణుని వైభవం
వివరిస్తూ ఈ విధంగా చెప్పాడు:
4-576-ఉ.
భూరి తపోభిరామ ముని పూజన మెవ్వని పాదపద్మ సే
వారతి వృద్ధిఁ బొంది యనివారణఁ బూర్వభవానుసార సం
సార మహోగ్రతాపము భృశంబుగఁ బాపఁగ నోపుఁ దత్పదాం
భోరుహజాత దేవనదిఁ బోలి యశేష మనోఘ హారియై.
భావము:
గొప్ప తపస్సంపన్నులైన మహర్షులను పూజించటం వల్ల ప్రాప్తించిన శ్రీహరి పాదసేవ ఆయన పాదపద్మాల నుండి పుట్టిన పవిత్ర గంగానది వలె జన్మ జన్మాంతరాలలో చేసిన పాపాలను, సంసార తాపాలను పూర్తిగా పోగొడుతుంది. అది సమస్త మనోమాలిన్యాలను తుడిచి పెడుతుంది.
4-577-వ.
మఱియు.
4-578-చ.
అనుపమ భక్తి నెవ్వని పదాంబుజమూలము మందిరంబుగా
ననయముఁ బొందు వాఁడు నిహతాఖిల భూరి మనోమలుండు స
ద్వినుత విరక్తి బోధ ధృతి వీర్య విశేష సమన్వితుండు దా
ననఁ దగి భూరి సంసృతి మహత్తర దుఃఖము నందఁ డెన్నఁడున్.
భావము:
సాటిలేని భక్తితో భగవంతుడైన నారాయణుని పాదపద్మాలను అనవరతం ఆశ్రయించిన వానికి సమస్త మనోదోషాలు తొలగిపోతాయి. గొప్ప వైరాగ్యం ప్రాప్తిస్తుంది. విజ్ఞానం, ధైర్యం, శక్తి లభిస్తాయి. అటువంటివాడు ఏనాడూ అపారమైన సంసార దుఃఖాన్ని పొందడు.
4-579-క.
నారాయణుండు జగదా
ధారుండగు నీశ్వరుండు; దలఁప నతనికిన్
లేరెందు సములు నధికులు
ధీరోత్తముఁ డతఁడు నద్వితీయుం డగుటన్.
భావము:
నారాయణుడు జగత్తుకు ఆధారమైన భగవంతుడు. ఆయనతో సమానులు కాని, ఆయన కంటె అధికులైనవారు కాని లేరు. ఆయన మహాధీరుడు, అద్వితీయుడు.