1- పాల్కడలిని పాలించెడి పద్మాక్షి కి రేడువాడు,
జగములు కుడిచెడి కుడుపును కనికరమున నొసగువాడు
నందాంగన కుడిపిన ఆ కుడుపులు తరుగని రోయుట,
చల్లలు ఒలుకగ కడవలు చిదుముట చిత్రంబే!
2- పట్టగ నొల్లని వానిని పట్టిన ఆ గోపాంగన,
పలుజన్మ పుణ్యఫలము పండిన రోజదియా?
పురవైరులు, పుణ్యజనులు పలుదారుల జేరిననూ,
పంతంబున తొలగెడి ఆ పద్మాక్షుని దయ యా? ||పాల్కడలిని పాలించెడి ||
3- మోదము మీరగ జగముల దొంగాటలు ఆడువాడు,
చిక్కెద నిదిగో రమ్మని చిరునవ్వుల తొలగువాడు,
సాగర కన్నియ కన్నుల చిక్కిన ఘనశూరుండగునీతడు
ఓపని శ్వాసన నలిగిన గోపెమ్మకు చిక్కినాడు! ||పాల్కడలిని పాలించెడి ||
4- కారణ మడుగకె కన్నల కరుణను ఒలికించు వాడు,
కామాతుర నణగించెడి కమలాక్షులు కలుగువాడు,
చూపే తూపుగ జేసుక సురవైరుల గూల్చువాడు,
గోపాంగన బెదిరింపుకు వెరపును చూపులనింపెను! ||పాల్కడలిని పాలించెడి ||
5- వరదాయకి శ్రీలక్షిని వీడక చూచెడి కన్నులు,
వరమౌనులు మౌనములో ఊహగ చూచెడి కన్నులు,
కన్నులు గట్టక గోపిక కన్నులు పొంగించు కనులు,
పొంగిన గంగను జూడగ తాళగ తరమే తల్లికి? ||పాల్కడలిని పాలించెడి ||
6- లీలామానుష విగ్రహు లాలించెడి గోపకాంత –
అరివైరుని ఆగడముల నదుపున జేయగ నెంచుచు,
జగముల తెరవగు ఉదరము నలుగంగా రజ్జుతోన
రోటికి కట్టిన వేడుక మోదముగాదే శౌరికి! ||పాల్కడలిని పాలించెడి ||
7- నమ్మిన నారదు వాణిని నిక్కము జేయగ తలుపడె,
నామము తలచెడి వారల నగుబాటును ఓర్వగలడె,
కావలి వారిని కావగ ధరణిన నడిచిన దేవుని,
లీలల నెన్నగ తరమే వరమౌనికి వజ్రికైన! ||పాల్కడలిని పాలించెడి ||
8- పలు తెరగుల హరి జేరగ చరణము లెరుగని తరువులు,
తపియించగ తపియించగ దయగనినా గోపాలుడు,
తరుణంబిదె తరువు తుంచ తగుదారిదియేనని,
తరుణికి చిక్కిన తీరును తలుపరె ముదమార! ||పాల్కడలిని పాలించెడి ||
9- సమసిన ముల్లోకములను చిరుబొజ్జన పదిలపరచిర
పసివాడిగ మర్రాకున పవళించిన రిపువైరికి,
కనకాక్షుడు హరియించిన ధరణిని గాచినవానికి,
పిడికెడు రోటిని గైకొని కదలుట ఒక పాటా! ||పాల్కడలిని పాలించెడి ||
10- బలితల మోపిన పాదము – గగనము గొలిచిన పాదము,
చిరుఅందెల సందడితో చిరుచిరు అడుగుల కదులుచు,
ఏపుగ పెరిగిన మానుల అంతరమును దాటి నడువ,
వేటుగ రోటిని మోదగ మానులు ఒరిగెను నేలను! ||పాల్కడలిని పాలించెడి ||
11- శాపము బాసిన యక్షులు శ్లాఘించుచు తరలిపోగ,
శోకించుచు గోపకాంత పరుగిడి నందను జేరుచు,
అక్కున జేర్చుక వెరపును మాపుచు తల ముద్దిడుచు,
వెన్నును నిమిరెడి లాలన మన్నన నందదె శౌరిది! ||పాల్కడలిని పాలించెడి ||
12- అన్నుల మిన్నగు గాధలు ఎన్నని నే నెరిగింతును?
అంబుజ నాధును లీలలు ఎన్నని నే నెరుగొందును?
అంతర వీధుల నాడెడి ఆనందాత్మజు తలపులే,
అరి బాధల హరియించెడి అంజన మని ఎరిగింతును! ||పాల్కడలిని పాలించెడి ||