నేను- నేను

నేను నేనని నీవు జగమెల్ల నిండినా – నేనెరుగ లే నైతి రామా,
నేనన్న నిను నేను ఎందెందు గనలేక – నలిగి నీరస నైతి రామా!

రాముడై నీవచట నిలిచి యున్నను గూడ – ‘నేను’ సోముడనందు రామా!
‘నేను’ రాముడ నైన – నే నెట్లు సోముడను – యోచనే కరువాయె రామా!

నేను నీ ‘తల్లి’నని లాలించగా మురిసి – రాగమందితి గాని రామా!
లాలించు లాలనల నీ లీల గనలేని – రాలుగాయిని ‘నేన’ రామా?

నేను నీ ‘గురువు’ నని గురుతు దెలుపగ మురిసి – గురి గొంటినను కొంటి రామా!
గురుతు దెలుపెడి నీదు గురిలోని గురిగనని – గుణహీనుడన ‘నేన’ రామా?

నేనె ‘తండ్రి’ని యంచు జగము నడుపగ నడిచి – వింత గొంటిని గాని రామా!
జగతి దారుల నడుపు నీ నడత గనలేను – బుద్ధిహీనుడ ‘నేన’ రామా?

నేనె నీ ‘తోడం’చు దరిజేరి జతగూడ – తమకమొందితి గాని రామా!
జతగూడు నీజాడ వివరమెరుగగ లేని – వెఱ్ఱి వాడన ‘నేన’ రామా?

నేన నీ ‘దైవ’మని దరిజేర్చ వత్తువని – పదురాడగ వింటి రామా!
రాచ బిడ్డవు నిన్ను నడచి చేరగ లేని – మందభాగ్యడ ‘నేన’ రామా?

ఏలువాడవు నీవు మోదమొందగ తగును – ఏతీరు గానైన రామా!
మోదమొందగ ‘నీవు’ నాలోమునకేయ – మతిమాలి ‘నేనై’తి రామా!

తీరు తెన్నులు నీవి- తీరమంతయు నీది – మున్నీట మునిగితిని రామా!
తెరపు మరపుల తెరపి తామసము హరియింప – తలపు తెరిపిని నిలుపు రామా!

పరిహాసమది ‘నీకు’ పలుశోకములు మాకు – పాలింపుమో ‘నన్ను’ రామా!
పరచింతనలు మాయ ఎరిగించు నీ ఉనికి – వెరపు మాపుము నాది రామా!

కనుల గట్టగ రాని కారుణ్యమది ఏల – కామ పాశము మాపు రామా!
కదలు జగమున నీదు జాడగాంచగల్గు – కనులు కల్గగజేయు రామా!

కరుణించుమో నన్ను రామా – కారుణ్యపుర ధామ రామా!
కావునను కనికరమున రామా – కాపాడ నా కెవరు రామా?

 

 

 

Leave a comment