నవమోహనా జూడుమా – సిరి పంతాన నినుపొంది మము మాటుజేసెను,
నవమోహనా జూడుమా…. ఒక పరి .. నవమోహనా జూడుమా..
క్షీరసాగరు పట్టి – పట్టి విడువని చేయి,
పట్టి వెన్నల దోచి – పట్టుబడి దొంగంచు ,
పట్టి పంతము మీర – పలుమారు దండింప,
పట్టి కొంగున జేరి – గారవించే వాడ! ||నవమోహనా జూడుమా…. ఒక పరి||
వసుధ వేడగ వచ్చి – వసుమతినె మరచేవొ,
జలజాక్షి జతలోనె జగమెల్ల జూసేవొ,
జామురాతిరి దాటె జాడైన గనరాదుర,
రాధామనోధార – ధరనేల దిగిరారా! ||నవమోహనా జూడుమా…. ఒక పరి||
గొల్లపల్లెలు నిన్ను గోవిందుడని గొలువ,
విందులందుచు మమ్ము మరచియున్నావో,
పల్లెవాసులమయ్య రేపగలు తలచేము,
మనసార నినుజేర పురసీమ విడలేము … ||నవమోహనా జూడుమా…. ఒక పరి||
అల మేలు గొలుపంగ ఆలించు మామొరలు
ఆలించి లాలించి పాలింపగా నీవె,
పులకింప మామేను పలికించు నీమురళి
మురవైరి ముదమార మదినేల రావేల ||నవమోహనా జూడుమా…. ఒక పరి||