కరుణించుమో రంగా – కరుణించుమో!
కరుణించు కరుణామయ నయనా – సాగర శయనా..
కరుణించుమో రంగా – కరుణించుమో!
సేవించి నిను జేర – దాసి పుత్రుడగాను,
సంగమున నిను జేర – సుదాముడగాను!
సరస సేవల జేర – గోపకాంతనుగాను,
సాదరంబుగ నన్ను కరుణించు రంగా.. కరుణించుమో రంగా – కరుణించుమో!
లాలించ నిను జేర – సతి దేవకినిగాను,
గోరుముద్దల గుడుప – నందకాంతనుగాను!
జతజేరి కవ్వింప గోపబాలుడగాను,
సాదరంబుగ నన్ను కరుణించు రంగా … కరుణించుమో రంగా – కరుణించుమో!
కావరమ్మని పిలువ – పాంచాలి నే గాను,
కదలి రావేమనగ – కరిరాజు నే గాను!
పంతాన నిను పొంద సురవైరి నే గాను,
సాదరంబుగ నన్ను కరుణించు రంగా … కరుణించుమో రంగా కరుణించుమో!
సకలంబు నీవన్న – దైత్యసుతు నేగాను,
నాదరూపుడవన్న నారదుడ నే గాను!
సకల లీలల పొగడ – వ్యాసపుత్రుడ గాను,
సాదరంబుగ నన్ను కరుణించు రంగా .. కరుణించుమో రంగా కరుణించుమో!
నీ పానుపమరంగ – ఫణిరాజు నేగాను,
నీ పాదమూనగా – ఖగరాజు నేగాను!
కరము సోకగ నీది – వెదురు కొమ్మను గాను,
సాదరంబుగ నన్ను కరుణించు రంగా … కరుణించుమో రంగా కరుణించుమో!
కరుణించు కరుణామయ నయనా – సాగర శయనా…
కరుణించుమో రంగా .. కరుణించుమో!