మోహపాశము దృంచి పాలింప రావె,
భవమోహ భావనల హరింప రావె,
కలిమి బలిమియు నీవె కరుణింప రావె,
అంధ మోహపు ముడుల నణగింప రావె!
దరివి నీవని ఎరిగి – దారెరుగ లేనే,
దానవాంతక నన్న దయనేల లేవా?
దురిత దూరా యింత దూరమా నీకు?
దుడుకు చేతలు నావి – దయనేల తగనా?
మోహపాశము దృంచి పాలింప రావే,
భవ మోహ భావనల హరియింప రావే!
ఆవలున్నది నీవు – అవని గాచెడి నీవు,
అంతరంగపు గిరుల ఆవరించెడి నీవు,
అదునుగాదయ నీకు ఆలసింపగ నేడు,
మనుగడెరుగని నన్ను మన్నించ రావే!
మోహపాశము దృంచి పాలింప రావే,
భవ మోహ భావనల హరియింప రావే!
మేలు మేలన నీకు మేలెంచు మాకు,
మేను వాలెడి నాడు తోడుండు మాకు,
మోహ తిమిరము బాప భేదమా నీకు?
భవ బంధ నాశకా భారమా నీకు?
మోహపాశము దృంచి పాలింప రావే,
భవ మోహ భావనల హరింపరావే!
కలిమి బలిమియు నీవె కరుణింప రావే,
అంధ మోహపు ముడుల నణగింప రావే!