తొలిగుండగ తగునా ఓ కరుణా మయ నయనా!
తుంటరి చేతలు నావని – తొలగుండగ తగునా!
తరుణము ఏదని ఎంచకు – తగులగ నా మదినా!
తీరులు తెన్నుల నెంచకు – తెలుపగ నీ కరుణా!
పిలిచిన పలికెడివాడని పదుగురు నిను పిలువా,
పంతంబున బదులీయక తొలిగుండుట తగునా!
పలుచన జేయగ తగునా పిలిచెడి నీ చెలికాడిని?
పిలుపున లోపములెంచుచు తొలిగుండగ తగునా!
తొలిగుండగ తగునా ఓ కరుణా మయ నయనా! తొలిగుండగ తగునా!
వానరు వాలిని గూల్చుగ మాటున జేరిన వాడవు,
మాటున దాగిన అతివను కరుణను జూచిన వాడవు,
మాయల మాటున మలిగెడి మము గావక తొలగుండగ,
మోదము నొందున నీ మది – మదనాంతక శరణా!
తొలిగుండగా తగునా – ఓ కరుణా మయ నయనా !
తుంటరి చేతలు నావని – తొలగుండగా తగునా!
అంబర వీధిన రాశిగ గోళములెన్నో యుండగ,
వసుధను గావగ వెడలిన వేదాంగుడ వైన నీవు,
వసుమతి సంతును గావక తొలగంగా తగున నీకు,
వాసము జేసిన నెలవున మొలచిన మొలకల నేలక..
తొలిగుండగా తగునా – ఓ కరుణా మయ నయనా!
తుంటరి చేతలు నావని – తొలిగుండగా తగునా!