నే నెరుంగని నన్ను కావుమో యనటంచు – పలుమారు పిలిచేను రంగా!
నెనరుంచి ఎరిగించు నేనెవ్వరను ఎరుక – వెరపు మాయగ నాది రంగా!
వేడుకొందును నిన్ను రంగా! వేంకటాచల వాస రంగా!
కుడుచు అన్నము నీవు కుడిపించు నది నీవు,
కుడుచు వాడెవ్వడో రంగా!
కడుచు రుచి మోహమున కడు వేదనల మునుగు,
లోనున్న వాడెవడు రంగా! లీలగా నెరిగించు రంగా!
లాలించగా నీవె రంగా! లయకారకుడ నీవె రంగా!
నేనెరుంగని నన్ను కావుమోయటంచు పలుమారు పిలిచేను రంగా!
నెనరుంచి ఎరిగించు నేనెవ్వరను ఎరుక – వెరపుమాయగ నాది రంగా!
వేడుకొందును నిన్ను రంగా! వేంకటాచల వాస రంగా!
ఎవ్వరీ నేనంచు ఎందరడిగిన గాని – మౌనమే బదులాయె రంగా!
మూగ భావన దెలియు మతి నిచ్చి మన్నించు,
మునిమానసోల్లాస రంగా! మరుగేల రా నీకు రంగా!
మముగావగా నీవె రంగా ! మధుకైట మర్దనా రంగా!
నేనెరుంగని నన్ను కావుమోయటంచు పలుమారు పిలిచేను రంగా!
నెనరుంచి ఎరిగించు నేనెవ్వరను ఎరుక – వెరపుమాయగ నాది రంగా!
వేడుకొందును నిన్ను రంగా! వేంకటాచల వాస రంగా!
మోహమొందేదెవరు ? మోహించునది ఎవరు?
మోహ కారణ మేమి రంగా?
మోహ మోదము దీరి బడలి యున్నది ఎవరు?
మొరలెరిగి ఎరిగించు రంగా! మోహ నాశక మేటి రంగా!
నేనెరుంగని నన్ను కావుమోయటంచు పలుమారు పిలిచేను రంగా!
నెనరుంచి ఎరిగించు నేనెవ్వరను ఎరుక – వెరపుమాయగ నాది రంగా!
వేడుకొందును నిన్ను రంగా! వేంకటాచల వాస రంగా!
పాప పున్నెపు పుంత పంతాన పలుమారు
తగిలి తిరునదెవరు రంగా!
పాపచింతన దీర పలుచింతనల మునిగి
పొగిలి పొరలునదెవరు రంగా!
పోలికెంచుము నాకు రంగా! పొంకాన ఎరిగించు రంగా!