నా ఓరిమింతని – ఓపగా లేననీ – ఎన్న నేనెంతటి వాడయా?
ఓరిమొసగెడి వన్నెకాడవు – సందియంబుల బాపుమా!
సమసిపోయెడి సకల జగముల – సారసంపద నీవయా!
సమయ సీమన సంచెరించెడి – అల్ప జీవుల నెరుగవా!
ఆదమరుపే అన్నపానము – పుడమి నడచెడి దారులా!
ఆదుకొనగా నిన్ను వేడగ – కాల మెక్కడ తోచదే!
కదలుటెరుగని కటిక కాలము – కనికరంబుల నెరుగదే!
తోడు నీవని వినుటెగాని – కానగా నే నెరుగనే!
కంటకంబగు కలివనంబున – కాలు ఊనగ నోర్వకే!
ఓర్వలేనని వల్లగాదని – వేదనొందితి వెరపుచే!
వెరపు బాపుము – జాడ దెలుపుము – జాలితో దరి జేరుమా!
తరుగు దారుల తగిలినా – నీ తనయనే గద గిరిధరా!
కడుపు కుడుపగ కొలువుజేసితి – ఈడు వన్నెలు తరుగగా ,
కరుగు కండలె కాసులుగ నా కంటి వెలుగును దోచెనే,
వెలతిబడి నా చూపుతో నే నెరుగకుంటినే ఏ గతీ,
గతులు గడచిన గడియలో ఏది గతియని ఎంచెదా?
పలుకగలిగిన పరువమంతా మోహపడి నే పలికితి ,
పలుకు పలుకుకు కాసుకుయగ మోదమున నే మునిగితీ,
చెల్లిపోయెను పరువమంతా కాసుకుప్పలు తరిగెనూ,
తగిన దారిది తగులుమనియెడి తోడు తెలియనె నేటికీ!
వాని వేడితె వెలతి తీరును – వీని వెడితె వెలుగు కలుగును,
ఒకరి జేరితె ఒరుగు సంపద – ఒరగజేతురటొకను మన్నన,
మందగించిన మతిఎరుంగదె – ఏది ఎంచిన మరలగలనని,
మరలు దారిని ఒరగజేసెడి వాని వైనము నెగనే!
మందగాచెడి వాడవే – నా జాడనెన్నగ తోచదా!
తోవజేసుక చేదుకొనుమా -చేదగతి ఇక నీవెగా!
వేగపడమని వేడుకొందును వేయిపదముల దేవరా!
చేదొకొమ్మని చెతులెత్తెద చెలిమి దెలిసిన దేవరా!
మురికి మగటపు మాంద్యమెంతని ఎంచబోవకు దేవరా!
నీ ఊహ బొందిన రూపమే ఇది పోలికొందుము దేవరా!
ఓరిముడిగెను ఓపకుంటిని తప్పుఒప్పుగ జేయరా!