తోడు తోడని వగచి – కోరి చేరివితి విటకు,
తోడెవ్వరే నీకు – చిలకా!
తొలగి నిలచును జగతి – తరలి పొమ్మని నిన్ను,
తోడెవ్వరే నీకు – చిలకా! తోడెవ్వరే నీకు చిలుకా?
రెక్క మొలవని నాడు – వేడుకొందగ నెంచి,
వెదకి జేరితి విటకు – చిలుకా!
వేడుకల వెలిమబ్బు వెలిసి వేదన మిగిలే,
వగపేలనే వెఱ్ఱి చిలకా!
తోడు తోడని వగచి – వెదకి చేరితి విటకు,
తోడెవ్వరే నీకు చిలకా? తోడెవ్వరే నీకు చిలుకా?
పరువమొందిన రెక్క – పరచి ఎగిరెడినాడు,
పంచ తోడెంచితివి – చిలకా!
పంపకంబుల బదులు పలువేదనలు దెచ్చె,
పొగిలి ఫలమేమింక – చిలుకా!
తోడు తోడని వగచి – వెదకి జేరితి విటకు ,
తోడెవ్వరే నీకు చిలకా? తోడెవ్వరే నీకు చిలుకా?
చిరుత రెక్కలు నిమిరి – మరిపాల మునిగేవు,
మోహపడి మురియకే – చిలుకా!
రెక్క ముదిరిన మొలక – తోడొంద ఎగిరేను,
తొలిగుండుటే మెరుగు – చిలుకా!
తోడు తోడని వగచి – వెదకి జేరితి విటకు,
తోడెవ్వరే నీకు చిలుకా? తోడెవ్వరే నీకు చిలుకా?
రెక్క అలుపుమును మరచి – రేయనక పగలనక,
తిరిగి కుడిపిన కుడుపు – చిలుకా,
కుడిచి పెరిగిన కూన – ఎంచదే పాశమును,
ఏది తోడిక నీకు – చిలుకా!
తోడు తోడని వగచి – తగిలితివి ఆనాడు,
తోడెవ్వరే నీకు చిలుకా? తోడెవ్వరే నీకు చిలుకా!
అలసి నలిగిన రెక్క – ఒరిగి కదలని నాడు,
తోడెవ్వరే నీకు – చిలుకా!
జగము తొలగిన నాడు – తోడుండు జతగాని,
తోడెంచి తరియించు – చిలుకా!
తోడు తోడని వగచి – తగిలితివి ఆనాడు,
తోడెవ్వరే నీకు చిలుకా? తోడెవ్వరే నీకు చిలుకా!
తోడు విడువని తోడు – జగతి నడిపే తోడు,
ఎంచి ఎరుగుము నేడె – చిలుకా!
తొలుత జేసిన తప్పు – తలచి వగచుట మాను,
లోనున్న తోడెరుగు – చిలుకా!
తోడు తోడని వగచి – తగిలితిచి ఆనాడు,
లోనున్న తోడెరుగు చిలుకా!
లోకేశు జతజేరు – చిలుకా! లోక చింతన మాను చిలుకా!