భ్రమ

తేట చక్కని రూపు – తెరపైన నా రూపు,
నాదనెంచుట మాని నేనె యని మురిసేను!

నను గన్న నా తల్లి – పలుమారు దెలిపేను,
ముచ్చటౌ నగుమోము గలిగి యున్నాననీ,
ననుగన్న నా తండ్రి – ఎన్ని ఎరిగించేను,
చూడ చక్కని తనువు తన పోలికేననీ!
పున్నెములు పండగా మొగ్గ తొడిగిన మేను,
నాదనెంచుట మాని నేనె యని మురిసేను!

తోడుగాడెడి వారు – వెంట నుండెడివారు,
తీరు తెన్నులు గల్గు తెలివి నాదేయనగ,
పలుకులల్లే తల్లి పలికించు పలుకెల్ల,
జిహ్వనాడెడి రుచికి ప్రకటరూపని ఎంచి,
మాయజగతిన మలుగ మనుగడొందే మేను,
నాదనెంచుట మాని నేనె యని మురిసేను!

పంకజాసను పడతి పంతమాడుట మాని,
కురిపించు కుసుమాల మాలలల్లిన మేను,
పద్మనాభుని ఇంతి పలుమారు దయజూసి,
కనికరించిన పంట భోగమందిన మేను,
వల్లెయన్నారోజు వెడల నడిపెడి మేను,
నాదనెంచుట మాని నేనె యని మురిసేను!

తనువు ముసుగున తగిలి తిరుగుటెరుగని నేను,
తరుణమంతయు తరుగు విధులంది మను నేను,
తనువు చక్రముబట్టి – తనువైరులను గొట్టి,
తెరపి తెలుపగ నన్ను తగిలుండు పన్నగుని,
తెలియు తెలివిని గల్గి – తెగనాడి మోహమును,
నేననెంచెడి మేను నాదియని గురుతెరిగి,
మదన జనకుని ఛాయ మదినెంచగలనా?

Leave a comment