చిన్ని ఆటలాడంగ రారా!

చిన్ని ఆటలాడంగ రారా – చిన్ని ఆటలాడంగ రారా
నందబాల యమున పిలిచే – చిన్ని ఆటలాడంగ రారా
మధురాపురాధీశ రారా – బృందామనోహార రారా!
భువనైక పోషకా రారా – చిన్ని ఆటలాడంగ రారా!
జానకిని బ్రోవనెంచి – శివుని విల్లు విరచి నీవు,
పరశువంది తిరుగువాని అహము దృుంచి అంపినావు!
అడవులందు ఉన్నవారి ఆదరించ నెంచినీవు,
అమ్మునంది అడవులంట తిరిగి తిరిగి అలసినావు!
చిన్ని ఆటలాడంగ రారా! నందబాల యమున పిలిచే!
చిన్ని ఆటలాడంగ రారా!
భీష్మకుని పుత్రి నిన్ను మనువునాడ రమ్మనంటె,
రచ్చజేసి రుక్మిణిని రాణిజేసి దెచ్చినావు!
సత్యభామ చింతదీర్చ మణిని మాటుజేసి నీవు,
కొండకోననున్న బంటు వెంట తగిలి ఆడినావు!
చిన్ని ఆటలాడంగ రారా! నందబాల యమున పిలిచే!
చిన్ని ఆటలాడంగ రారా!
పాండవులు కౌరవులు పందెమేసి జూదమాడ,
బావ వెంట అడవులంట తోడునీవు నడచినావు,
బండిగట్టి పోరులోన చీడనెల్ల బాపినావు,
వేటగాని వేటుతోన తనువుబాసి తరలినావు!
చిన్ని ఆటలాడంగ రారా! నందబాల యమున పిలిచే!
చిన్ని ఆటలాడంగ రారా!
మధురాపురాధీశ రారా – బృందామనోహార రారా!
భువనైక పోషకా రారా – చిన్ని ఆటలాడంగ రారా!

Leave a comment