రాడన్న రేడొచ్చె

రాడు రాడేమన్న రేడీ రోజొచ్చి -రమ్మంచు పిలిచేను నన్నే!
వేణువూదెడి వాడు- వెఱ్ఱి గొల్లడు కాడు,
వేవేల గోవులను పాలించు వాడు!
ఆలమందను జేర ముదమార పిలిచేను,
తరలి పోదును నేను – తరలింక రాబోను!
రాడు రాడేయన్న రేడీ రోజొచ్చి – రమ్మంచు పిలిచేను నన్నే!
వెన్నముద్దలు లేని వట్టి చేతులతోన,
మదినిండ నిండున్న ముదముతోన,
మారాముతోనన్ను విడనాడనీ తనువు,
తలుపు గొళ్ళము దీసి – తరలింక నేపోదు!
రాడు రాడేయన్న రేడీరోజొచ్చి – రమ్మంచు పిలిచేను నన్నే!
వెన్నెలాటల వాడు – వెన్నంటి యుండంగ,
వేల గోవుల మంద తోడుండి నడువంగ,
వెలితెరుగనా సీమ వెలుగు దారులవెంట,
సమయ చోరునివెంట తరలింక నేపోదు!
రాడు రాడేయన్న రేడీరోజొచ్చి – రమ్మంచు పిలిచేను నన్నే!
జంటనాడితి నంచు జతజేరగాలేవు,
వెంటనడచితి నంచు వెన్నాడిరాలేవు,
మరలి రమ్మని నన్ను మౌనాన పిలిచేవు,
మరలుటెరుగని దారి తరలినే పోదారి!
రాడు రాడేయన్న రేడీరోజొచ్చి – రమ్మంచు పిలిచేను నన్నే!

Leave a comment