చూపు

చూచెదనే నేరీతిన చూడగ దుస్సాధ్యమైన దివ్యుని రూపున్,

చూడగనే నెంచినంత చూడంగాగలన నేను,
చూడగ దుస్సాధ్యమైన దివ్యుని రూపున్,
చూపుల చిక్కని వాడని లోచూపులు కల్గువారు,
చూచాయిగ నెరిగింపగ ఎరిగితినయ్యా!
చూచితిరట దివ్యాంగుని చేతనలుడిగన అతివలు,
మానమునెంచని మతులన కోనేటిన నిలచినపుడు,
చూచితిరట చిద్రూపుని లీలామయ చేష్థితములు,
ద్రుపదుని పట్టిని గాచెడి దివ్యాంబర మిచ్చినపుడు!
చూడగనే నెంచినంత చూడంగాగలన నేను,
చూడగ దుస్సాధ్యమైన దివ్యుని రూపున్!
ధారుణి నడచిన వేళల చూచితిరా పరమపురుషు,
ధారణలో ధరనేలెడి దనుజాంతకు నెంచువారు,
దయగని ఎరిగింపనెరిగి జూచితిరట విబుధజనులు,
చేరిన చెలిమిని తెలుపగ కన్నుల జూచెను విజయుడు!
చూడగనే నెంచినంత చూడంగాగలన నేను,
చూడగ దుస్సాధ్యమైన దివ్యుని రూపున్!
చూడగనెంచని అసురులు జూచితిరట వైరంబున,
చూపున నిలిపిన గొల్లలు జూచితిరట స్నేహంబున,
చూపేవానిగ ఎరిగిన పల్లెల గోపీజనములు,
చూచితిరట చూపానిన చోటెల్లను గోనాధుని!
చూడగనే నెంచినంత చూడంగాగలన నేను,
చూడగ దుస్సాధ్యమైన దివ్యుని రూపున్!
చూచెడి భాగ్యము నొసగగ దీరిన కొలువున తీరుగ
చూపెరుగని నరనాధుడు చూచేనట సురనాధుని,
చిరకాలము చింతించిన కురవీరుడు చూడగలిగె
చితిచేరెడి తుదిఘడియన చిన్మయు దయచే!
చూడగనే నెంచినంత చూడంగాగలన నేను,
చూడగ దుస్సాధ్యమైన దివ్యుని రూపున్!
చూపుల నిండిన కరుణన చూడగరాదా నన్నిక,
చీకులు చింతలు దీరగ చిలుకగ రాదా చెలిమిని,
చిందెడి వెలుగుల రూపును చూడగలేనీ చూపును,
చెలువముతో చక్కజేసి చూపగరాదా ఉనికిని!
చూడగనే నెంచినంత చూడంగా లేని ఉనికి,
చూచెడి చూపీయరాద చింతలు దీరా!

Leave a comment