తరలించు

భవబంధముల బాధ భారమైయ్యేనంచు,
పలుమారు నిను పిలుతు – రంగా!
బంధమెరుగని నీకు – ఏ తీరు నెరిగింతు,
బంధ భారపు తీరు – రంగా!

తగులకుంటే తరుగు – తగిలితే అది బరువు,
జగతి తీరిదియేన – రంగా!
తగుల జేతురు – తనువు తొలగేటి దశవరకు,
తగులుటే మెరుగంచు – రంగా!

సుంకములు చెల్లింప సావకాశము లేక,
రేపగలు అలసేను – రంగా!
సంతు సాకను తగిన సంపాదనేలేక,
కుమిలి కృంగేనయ్య – రంగా!

లోనున్న వాడవని లోతెలివి నీవెయని,
లోకులందురు గాని – రంగా!
లోచనంబులు మూసి మురిపాన దేలేవు,
తెలివి పలికేదెపుడు – రంగా!

తనువుతో బంధంబు తగని భారంబైన,
తరలుటెరుగను నేను -రంగా!
తరలిపొమ్మను వరకు తగుల జేయకు నన్ను,
కరుణగొని తరలించు – రంగా!

Leave a comment