పిలుపు

కదలి రమ్మని పిలువ – నెమ్మదింతునొ ఏమొ,
కసిరి రమ్మని పిలవ – బెదరిపోదు,
చేర రమ్మని పిలువ – తొలగుందునో ఏమొ,
హరియించవే నన్ను – కమల నయనా!

కస్తూరి జవ్వాది అద్ది సాకిన మోను,
తోడు తానొత్తునని పంతమాడును గాని,
తగిలుండు తరుణంబు మించి పోయేనంచు,
తుంచి చెర విడిపించు – విమల చరితా!

తోడునడచినవారు తోడు నడచేమనగ,
నెమ్మదింతునొ ఏమొ నెనరుచేత,
మన్ననెరుగని జరతి నెనరన్న ఏమెరుగు,
నెనరుంచి నన్నేలు – నళిన మిత్రా!

పున్నెపాపపు ఫలము పలుమారు పిలిచెనని,
పలుక నెంతునొ ఏమొ ముదముతోన,
మోహపంజరమందు ముదమొందనేలంచు,
ముదమార ననుజేరు – మధుర వదనా!

సరివార మేమంచు సరసాన మన్నింప,
సావకాశమునొంది నిలుతునేమో!
సాధుజన పాలకా సావధానము నొంది,
గురిదారి మరలించు – గరుడ గమనా!

జతజేరి ఈ జగతి జాడ తెలిపితిమంచు,
వెంటనుందుమనంటె – మురుతునేమో!
జంటబాయని తోడ – జగమేలు జతగాడ,
జరభీతి మడియించి – మనుపు మయ్యా!

Leave a comment